Tuesday, August 23, 2011

Be Careful - Mobile Phone (collected from AJ Newspaper)

పెట్రోల్‌బంకులు, గ్యాస్ స్టేషన్‌లు, న్యూక్లియర్ ప్లాంట్లు, ఐసీయూలు వంటి రక్షిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్‌లు వినియోగించడం నిషేధం. అయినా నిషేధానికి తూట్లు పొడుస్తూ మనం మొబైల్‌లను యథేచ్చగా వినియోగిస్తూనే ఉన్నాం. నిషేధిత ప్రదేశాల్లో మొబైల్ వినియోగించడం వల్ల ప్రమాదాలకు దారి తీయవచ్చని అంటున్నారు నిఫుణులు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం...

ఓ కార్పొరేట్ ఆయిల్ కంపెనీలో పెట్రోలియం ఇంజనీరుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ మొబైల్ ఫోన్ కొన్నాడు. ఆ సెల్‌ఫోన్‌తో వచ్చిన సేఫ్టీ ఇన్‌ఫర్‌మేషన్ గైడ్‌ను చూడకుండా ఇంట్లో పక్కన పడేసి, ఆ ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాంకర్ల వద్ద తనిఖీలు నిర్వర్తించాలి. అలా విధి నిర్వహణలో ఉండగా ఓ రోజు హఠాత్తుగా ఓ ట్యాంకరు వద్ద గ్యాస్ లీకైంది. అప్పుడే వెంకటేశ్వరరావు జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగటంతోపాటు భళ్లున శబ్ధం చేస్తూ పేలింది.

అంతే వెంకటేశ్వరరావుతోపాటు ఆయన సమీపంలో ఉన్న నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపారు. కేవలం సెల్‌ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేయనందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు. ఈ సంఘటన ఇక ముందు అందరికీ గుణపాఠం కావాలని ట్యాంకర్ల వద్ద మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలి అని బోర్డు పెట్టారు. ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కంపెనీలో నిర్ణయించారు.

***ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల మంది మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, టెలివిజన్‌ల కంటే కూడా ఈ ఫోన్‌లు అధికంగా వినియోగిస్తున్నా, వీటి వాడకంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రపంచంలో ప్రతి సెకండ్‌కు 3,070 కొత్త మొబైల్ ఫోన్‌ల విక్రయాలు సాగుతున్నాయంటే వీటికి పెరుగుతున్న డిమాండ్ ఏమిటో విదితమవుతోంది.

ప్రపంచాన్ని ఆవిష్కరించడంతోపాటు సత్వర సమాచార సాధనంగా, వినోద పరికరంగా, కెమెరాగా ఇలా బహుళార్ధ సాధక పరికరంగా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్ అరచేతిలో ఇమిడి ఉంటుంది. ఎన్నో రకాల ప్రయోజనాలతోపాటు సమాచార సాధనంగా ఉపయోగపడుతున్న ఈ మొబైల్ ఫోన్‌లను సురక్షితంగా వినియోగించడంలో ముందు జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు పొంచి ఉందని అంటున్నారు నిపుణులు.

ప్రతీ మొబైల్ ఫోన్ వెంట ఇస్తున్న సేఫ్టీ ఇన్‌ఫర్‌మేషన్ గైడ్‌లను ఎవరూ కూడా చదవటం లేదు. ఉత్పత్తిదారులు, సేఫ్టీ నిపుణులు ఇస్తున్న సూచనలను మొబైల్ వినియోగదారులు పాటించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల పలు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిత్యావసరంగా మారిన మొబైల్‌ఫోన్‌ను కొన్ని జాగ్రత్తలతో వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

*** పెట్రోల్ బంక్‌లో...
మీ కారు లేదా ద్విచక్ర వాహనానికి బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గ్యాస్ నింపుకుంటున్నారా? అయితే పెట్రోల్ బంకులోకి ప్రవేశించే ముందే మీ సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ వాహనంలో ఇంధనం నింపుతున్నపుడు సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉంటే వచ్చే చిన్న మెరుపు వల్ల క్షణాల్లో పెట్రోల్‌బంకు పేలిపోయే ప్రమాదముంది. పొగతాగడం, అగ్గిపుల్ల వెలిగించటం వల్ల మీ కారు లూజ్ వైరింగ్, ఇంథన పైపు లీకేజీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంది.

అందువల్లనే మీరు పెట్రోల్‌పంపుతోపాటు ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలు, గ్యాస్‌తో పనిచేసే కంపెనీల్లో తప్పనిసరిగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో పనిచేసేవారు మెటల్ పౌడరు, న్యూక్లియర్ ప్లాంట్లు, బోట్లు, కెమికల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మొబైల్ ఫోన్‌లను పని ప్రదేశాల్లో వినియోగించటం ప్రమాదకరం. రేడియేటర్‌లు, స్టవ్‌లు, వేడినిచ్చే యాంపిల్‌ఫియర్స్‌కు మొబైల్‌ను దూరంగా ఉంచండి.

విమానాల్లో...
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ నిబంధనల ప్రకారం విమానం లేదా హెలికాప్టర్‌లలో ప్రయాణిస్తున్నపుడు రేడియో, వైర్‌లెస్ తరంగాలను పంపించే పరికరాలైన సెల్‌ఫోన్‌లను నిషేధించారు. విమానంలో ఎక్కేముందు సెల్‌ఫోన్‌ను విధిగా స్విచ్ ఆఫ్ చేయాలి. లేకుంటే సెల్‌ఫోన్ తరంగాలతో ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం వాటిల్లే అవకాశముంది. దీనివల్ల మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులందరికీ ప్రమాదం. ఎయిర్‌క్రాఫ్ట్ నేవిగేషన్, కమ్యూనికేషన్‌ల వ్యవస్థను దెబ్బతీసే సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు.

ఆసుపత్రుల్లో...
ఆసుపత్రుల్లో సున్నితంగా ఉన్న వైద్య పరికరాలను ప్రభావితం చేసే సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు. దీనివల్ల ఆ వైద్య పరికరాలు సజావుగా పనిచేయవు. దీంతోపాటు పేస్‌మేకర్, హియరింగ్ పరికరాల లాంటి వ్యక్తిగత వైద్య పరికరాలు అమర్చుకున్న వారు ఈ సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు. ప్రస్తుతం వస్తున్న ఆధునిక విద్యుత్తు పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ల సాయంతో పనిచేస్తున్నాయి. అందువల్ల వాటి వద్ద సెల్‌ను వినియోగించరాదు.

పేస్‌మేకర్ తయారు చేసిన కంపెనీతోపాటు ఫిజిషీయన్‌ను సంప్రదించి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పేస్‌మేకర్‌కు బ్లాక్‌బెర్రీ ఫోన్ ఉన్నవారు దానిని 20 సెంటీమీటర్లు దూరం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫోన్‌ను ఛాతీ వద్ద ఉన్న జేబులో పెట్ట రాదు. కొన్ని డిజిటల్ వైర్‌లెస్ పరికరాలు కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్‌లను ప్రభావితం చేస్తాయి. వైర్‌లెస్ సర్వీస్ ప్రోవైడర్‌తోపాటు హియరింగ్ ఎయిడ్ ఉత్పత్తిదారును సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతోపాటు ఆసుపత్రుల్లో సెల్ వినియోగం నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన ఈ సెల్ రేడియేషన్ వల్ల పలు నష్టాలున్నాయని వైద్యులు చెపుతున్నారు. అందువల్ల రోగులే కాదు వైద్యులు, నర్సులు కూడా మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. ముందు జాగ్రత్తలు తీసుకొని మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉంటాయి.
- సలీం
ఇలా చేయండి...
మొబైల్ ఫోన్‌ల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటంతోపాటు కొన్ని సూచనలు పాటించటం ద్వారా దీనివల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
- వాహనంలో పెట్రోల్ నింపే సమయంలో విధిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
- గ్యాస్ స్టేషన్స్ దగ్గర, గ్యాస్ ఫిల్లింగ్ సమయంలో, ఐసీయూలో మొబైల్ ఉపయోగించకండి.
- మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిషేధం ఉన్న ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడకుండా ఉండండి.